Ram Gopal Varma: బాలీవుడ్ వాళ్లు ఇకపై తమ సినిమాలను ఓటీటీలకు తీసుకోవాల్సిందే: రామ్ గోపాల్ వర్మ
- బాలీవుడ్ ను షేక్ చేస్తున్న దక్షిణాది చిత్రాలు
- బాలీవుడ్ వెనుకపడటంపై ఇప్పటికే పెద్ద చర్చ
- ఉత్తరాది చిత్రాలు డీలా పడ్డాయంటూ తాజాగా వర్మ ట్వీట్
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా, ఏది మాట్లాడినా సంచలనమే. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసి ఆయన వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా బాలీవుడ్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ పని అయిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. 'పుష్ప' సినిమా ఘన విజయం సాధించినప్పటి నుంచి బాలీవుడ్ పై వర్మ సెటైర్లు వేయడం ప్రారంభమయింది. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2' చిత్రాలు తిరుగు లేని విజయం సాధించిన తర్వాత ఇది మరింత ఎక్కువయింది.
దక్షిణాది చిత్రాలు ఘన విజయాలను అందుకోవడం, ఉత్తరాది చిత్రాలు డీలా పడటం చూస్తుంటే... కేవలం ఓటీటీల కోసమే బాలీవుడ్ సినిమాలను తెరకెక్కించే రోజులు వచ్చేలా ఉన్నాయని వర్మ అన్నారు. బాలీవుడ్ ని దక్షిణాది సినిమాలు డామినేట్ చేస్తున్నాయనే చర్చ ఇప్పటికే పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ తరుణంలో వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచేలా ఉన్నాయి.