Andhra Pradesh: అమరావతిపై రైతుల పక్షాన ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశాం: బీజేపీ ఎంపీ జీవీఎల్
- అమరావతి అభివృద్ధికి పెద్దగా నిధులు అవసరం లేదన్న జీవీఎల్
- రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగానే ఉందని వెల్లడి
- అభివృద్ధికి ఐదేళ్లంటే కోర్టు తీర్పును ఉల్లంఘించినట్టేనని వ్యాఖ్య
- ఎప్పటికైనా ఏపీ రాజధాని అమరావతేనన్న జీవీఎల్
ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ధి విషయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ తెలుగు న్యూస్ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా అమరావతి విషయంపై జీవీఎల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములను త్యాగం చేసిన రైతుల పక్షానే తాము కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశామన్న జీవీఎల్.. ఈ పిటిషన్‌పై కోర్టు ఏ నిర్ణయం ప్రకటిస్తుందన్న విషయంపై వేచి చూస్తున్నామని ఆయన తెలిపారు.
అమరావతిలో అభివృద్ధి పనులను నెల లోగా పూర్తి చేయాలంటూ ఇటీవలే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాజధాని అభివృద్ధి అనేది ఒక నెలలో పూర్తి అయ్యే పని కాదని, క్రమానుగతంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్లాల్సి ఉందని, ఇందుకు ఐదేళ్ల సమయం పడుతుందని ఏపీ ప్రభుత్వం కోర్టుకు విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు తీర్పును ప్రభుత్వం ధిక్కరిస్తోందని ఆరోపిస్తూ రైతులు కోర్టును ఆశ్రయించారు. వారికి మద్దతుగా బీజేపీ తరఫున కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసినట్లుగా జీవీఎల్ తెలిపారు.
ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి విషయంలో నిధుల అవసరం పెద్దగా లేదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. అమరావతి నిర్మాణం కోసం మరో రూ.1,000 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగానే ఉందని ఆయన తెలిపారు. అయినా అభివృద్ధికి ఐదేళ్ల సమయం అంటే కోర్టు తీర్పును ఉల్లంఘించినట్టేనని కూడా ఆయన పేర్కొన్నారు. ఏపీ రాజధానిగా ఎప్పటికైనా అమరావతే ఉంటుందన్న జీవీఎల్.. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా హైకోర్టు ఇచ్చిన తీర్పే రిపీట్ అవుతుందని వ్యాఖ్యానించారు.