traffic: అమిత్ షా పర్యటన వేళ... హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి తుక్కుగూడ వైపు వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఎల్బీనగర్, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో దారి మళ్లింపులు
- ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబరు 14 వద్ద భారీ వాహనాలకు అనుమతి లేదు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రామంతాపూర్ లో పర్యటించిన అనంతరం అమిత్ షా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ప్రజా సంగ్రామ యాత్రకు వెళ్లనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు చెప్పారు. నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుక్కుగూడ వైపు వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు.
ఎల్బీనగర్, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట నుంచి శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని చెప్పారు. మరోవైపు, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబరు 14 నుంచి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలను అనుమతించబోమని తెలిపారు. కాగా, రామంతాపూర్ లో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీని అమిత్ షా ప్రారంభిస్తారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో తుక్కుగూడలో ముగియనున్న నేపథ్యంలో ఇందులో అమిత్ షా పాల్గొననున్నారు. రంగారెడ్డి జిల్లాల్లో బండి సంజయ్ 31 రోజుల పాటు సుమారు 400 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు.