Cricket: అందరిలాగానే కోహ్లీ విసిగిపోయాడు: ఆర్సీబీ టీమ్ డైరెక్టర్
- కోహ్లీపై డగౌట్ లో ఎన్నో ఆశలు పెట్టుకుందన్న మైక్ హెస్సన్
- అయినా నిరాశ తప్పలేదని విచారం
- త్వరలోనే భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఆశాభావం
బ్యాటింగ్ కింగ్ గా పేరు సంపాదించిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు అదే బ్యాటింగ్ లో తేలిపోతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో అతడి వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ అతడు తడబడ్డాడు. మొదట్లో బాగానే ఆడి టచ్ లోకి వచ్చాడనిపించినా.. ఆ వెంటనే ఔటైపోయాడు.
దీనిపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్ స్పందించాడు. ఈ సారైనా అతడు భారీ ఇన్నింగ్స్ ఆడతాడనుకున్నామని, కోహ్లీ బ్యాటు నుంచి భారీ పరుగులు వస్తాయని డగౌట్ ఎన్నో ఆశలు పెట్టుకుందని చెప్పాడు. కానీ, అంతా బాగా జరుగుతోందనుకున్న టైంలో ఔటైపోయాడని విచారం వ్యక్తం చేశాడు.
తనను తాను బాగా సిద్ధం చేసుకున్నాడని, అయితే, మళ్లీ నిరాశ తప్పలేదని అన్నాడు. అందరిలాగానే కోహ్లీకీ విసుగొచ్చేసిందని చెప్పాడు. కోహ్లీ ఆటలో ఎక్కడా తప్పు లేదని, త్వరలోనే అతడు భారీ ఇన్నింగ్స్ తో చెలరేగి పోతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆర్సీబీకి ఉన్న అత్యున్నత ఆటగాడు కోహ్లీ అని చెప్పాడు. కాగా, నిన్న జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 14 బంతులాడి 20 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.