BJP: 3 రాజధానులు ఇక సాధ్యం కాదు: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
- ఏపీ రాజధానిగా అమరావతేనన్న జీవీఎల్
- 3 రాజధానులు ఓ రాజకీయ నినాదమేనని వ్యాఖ్య
- కేంద్ర సంస్థల నిర్మాణాలకైనా అనుమతి ఇవ్వాలన్న జీవీఎల్
ఏపీ రాజధాని అమరావతి భవిష్యత్తుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి 3 రాజధానుల ఏర్పాటు ఇకపై సాధ్యం కాబోదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి రాజధానిగా అమరావతే కొనసాగుతుందని కూడా ఆయన కీలక వ్యాఖ్య చేశారు. తమ పార్టీ అభిమతం కూడా అదేనని ఆయన పేర్కొన్నారు.
3 రాజధానుల విషయంలో బిల్లు పెట్టే విషయంపై ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరుపై స్పందించిన సందర్భంగా జీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి 3 రాజధానులు అన్నది కేవలం ఒక రాజకీయ నినాదంగా మాత్రమే మిగిలిపోతుందని ఆయన చెప్పారు. 3 రాజధానులు సాధ్యం కాదు కాబట్టే... బిల్లును ప్రభుత్వం పెట్టడం లేదని ఆయన తేల్చేశారు.
3 రాజధానులు సాధ్యం కాదన్న విషయం తెలిసినా... అమరావతిలో పనులను ప్రభుత్వం జాప్యం చేస్తోందని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి రూ.50- 60 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పనేమీ లేదని చెప్పిన జీవీఎల్... కనీసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భవనాల నిర్మాణాలకైనా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే ఆయా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అమరావతిలో భూములు కేటాయించిన విషయాన్ని గుర్తు చేసిన జీవీఎల్..ఆయా స్థలాల్లో కేంద్ర సంస్థల కార్యాలయాలు నిర్మితమైతే అభివృద్ధి దానంతటదే జరుగుతుందని అభిప్రాయపడ్డారు.