Andhra Pradesh: ఏపీ బడ్జెట్లో చూపని అప్పులు... వివరాలు ఇవ్వాలంటూ పీఏజీ లేఖ
- ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శికి పీఏజీ లేఖ
- ఆయా సంస్థల పేరిట రుణాలకు ప్రభుత్వం హామీ ఇచ్చిందన్న పీఏజీ
- ఆ రుణాలన్నీ ప్రభుత్వ అప్పులుగానే మారుతున్నాయని వెల్లడి
- రుణ సంస్థల వివరాలతో పాటు ప్రభుత్వ హామీల ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశం
ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శికి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (పీఏజీ) కార్యాలయం నుంచి శనివారం ఓ లేఖ అందింది. రాష్ట్ర బడ్జెట్లో చూపని అప్పుల వివరాలు అందజేయాలంటూ ఆ లేఖలో పీఏజీ కార్యాలయం ఏపీ ఆర్థిక శాఖను కోరింది. ఈ నెల 31లోగా వివరాలన్నింటినీ అందజేయాలని ఆ లేఖలో పీఏజీ కార్యాలయం కోరింది.
ఏపీలో పీఎస్యూలు, కార్పొరేషన్లు, సొసైటీల పేరిట పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారని పేర్కొన్న పీఏజీ కార్యాలయం... ఈ సంస్థలన్నీ ప్రభుత్వ హామీతోనే రుణాలు తీసుకున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలోనే రుణాలు తీసుకున్న ఆయా సంస్థల పేర్లు, వాటికి ప్రభుత్వం ఇచ్చిన హామీల ఉత్తర్వులు అందజేయాలని పీఏజీ కోరింది. ప్రభుత్వ పథకాల అమలుకు రుణాల వివరాలు బడ్జెట్లో నమోదు కాలేదని లేఖలో తెలిపిన పీఏజీ... ఈ రుణాలన్నీ ప్రభుత్వ అప్పులగానే మారుతున్నాయని తెలిపింది.