COVID19: ఉత్తర కొరియాలో కరోనా విస్ఫోటం.. ఎంటరైన 3 రోజుల్లోనే 8,20,620 కేసులు
- ఆసుపత్రుల్లో 3,24,550 మందికి చికిత్స
- ఇవాళ మరో 15 మంది మహమ్మారికి బలి
- 42కు పెరిగిన కరోనా మరణాల సంఖ్య
ఉత్తర కొరియాలో కరోనా మహమ్మారి విస్ఫోటం చెందింది. కఠిన లాక్ డౌన్ లు పెట్టినా, క్వారంటైన్ రూల్స్ ను అమలు చేసినా.. ఆ దేశంలోకి ఎంటరైన మూడు రోజుల్లోనే కేసులు లక్షలు దాటేశాయి. ఇప్పటిదాకా 8,20,620 కేసులు నమోదు కాగా.. బాధితుల్లో 3,24,550 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ మరో 15 మంది ‘జ్వరం’ వల్ల చనిపోయారంటూ ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 42కు పెరిగింది.
కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండడంతో దేశమంతా లాక్ డౌన్ విధించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, నగరాలు, కౌంటీల్లో లాక్ డౌన్ కొనసాగుతోందని ఆ దేశ అధికారిక పత్రిక కేసీఎన్ఏ వెల్లడించింది. పని ప్రాంతాలు, ఉత్పత్తి యూనిట్లు, నివాస సముదాయాలన్నింటినీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా మూసేసినట్టు పేర్కొంది.
కాగా, దేశంలోకి ఒమిక్రాన్ ఎంటరైందని ఉత్తరకొరియా గత గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసులు పెరిగిపోతుండడంతో నిన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మహమ్మారితో దేశం అల్లాడుతోందని ఆయన అన్నారు.