health stars: ప్యాకేజ్డ్ ఫుడ్స్ పై హెల్త్ స్టార్స్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వైద్యులు!
- అశాస్త్రీయమైన అధ్యయనం ఆధారంగా తీసుకున్న నిర్ణయం
- ఎఫ్ఎస్ఎస్ఏఐ దీన్ని అమలు చేయకుండా అడ్డుకోవాలి..
- ప్రజారోగ్య నిపుణుల బృందం సూచన
- ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ
- ఆరోగ్యపరమైన హెచ్చరికలతో ఫలితంటూ సూచన
ప్యాకేజ్డ్ ఫుడ్స్ వినియోగం దేశంలో భారీగా పెరుగుతోంది. తీరిక లేని జీవితాలు, శ్రమించలేని తత్వాలు కలిసి వీటిని వినియోగించే వారి సంఖ్య అధికమవుతోంది. అయితే ఈ ఉత్పత్తుల్లో తయారీ సంస్థలు ఆరోగ్యానికి హాని కలిగించేవి కూడా వాడుతుంటాయి. కాకపోతే అవి నిషేధిత పదార్థాలు అయితే కాదు. ఉదాహరణకు ఆలూ చిప్స్ లో ఉప్పు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే రక్తపోటు బాధితులకు సమస్య ఏర్పడవచ్చు.
అందుకుని ఈ తరహా ప్యాకేజ్డ్ ఫుడ్స్ పై ఆరోగ్యానికి ఎంత మంచో సూచించే విధంగా స్టార్స్ విధానాన్ని తీసుకురావాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్ణయించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం), అహ్మదాబాద్ చేసిన అధ్యయనం ఆధారంగా ఈ నిర్ణయానికొచ్చింది.
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై బీఐఎస్ స్టార్ మార్కులను చూసే ఉంటారు. 5 స్టార్స్ ఉంటే తక్కువ విద్యుత్ వినియోగించుకుంటుందని అర్థం. అలా ఒక్కో స్టార్ తగ్గుతున్న కొద్దీ ఆ ఉత్పత్తి వినియోగించే విద్యుత్ ఎక్కువగా ఉంటుందని, పరోక్షంగా పర్యావరణానికి ఆ మేరకు నష్టం కలిగిస్తుందన్నది అందులోని అంతరార్థం.
అదే మాదిరిగా హెల్త్ స్టార్స్ ను ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉత్పత్తులపై తీసుకురావాలన్న ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయాన్ని కొందరు వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ఐదుగురు ప్రజారోగ్య నిపుణులు ఈ విషయంలో ప్రధాన మంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవాలని.. హెల్త్ స్టార్స్ విధానాన్ని అడ్డుకోవాలని కోరడం తాజా పరిణామం. అశాస్త్రీయ అధ్యయనం ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు చెబుతున్నారు.
‘‘ఐఐఎం అహ్మదాబాద్ చేసిన అధ్యయనం శాస్త్రీయంగా లేదని మేము నమ్ముతున్నాం. భారత్ లో ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన విధాన నిర్ణయం తీసుకునేందుకు ఈ అధ్యయనం తగినది కాదు’’అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, కార్డియాలజిస్ట్ కే శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై ప్రతిపాదిత హెల్త్ స్టార్ రేటింగ్ విధానాన్ని రద్దు చేసే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పీఎంవో కార్యాలయానికి లేఖ రాశారు. శ్రీనాథ్ రెడ్డితోపాటు, సీనియర్ పీడియాట్రీషియన్ హెచ్ పీఎస్ సచ్ దేవ్, కమ్యూనిటీ పీడియాట్రీషియన్ వందనా ప్రసాద్, న్యూట్రిషనిస్ట్ యూనిసెఫ్ మాజీ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ కేఆర్ ఆంథోనీ తదితరులు ఈ లేఖ రాసిన వారిలో ఉన్నారు.
స్టార్స్ బదులు ఆరోగ్యపరమైన హెచ్చరికలు ఆహారోత్పత్తుల ప్యాక్ లపై ప్రవేశపెట్టాలన్నది ఈ వైద్యుల సూచనగా ఉంది. ఇవి అయితే, అందులో ఉన్న పదార్థాలను తెలియజేస్తాయని.. స్టార్స్ అయితే కొనుగోలుదారులకు సరైన అవగాహన కలిగించలేవన్నది వారి అభిప్రాయంగా ఉంది.