CEC: భారత ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్
- 2025 ఫిబ్రవరి వరకు సీఈసీగా రాజీవ్ కుమార్
- 2024 సార్వత్రిక ఎన్నికలను నిర్వహించనున్న నూతన సీఈసీ
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలూ రాజీవ్ ఆధ్వర్యంలోనే
- శనివారం పదవీ విరమణ చేసిన సుశీల్ చంద్ర
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటిదాకా కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్‌గా కొనసాగిన ఆయనను ప్రధాన కమిషనర్‌గా నియమిస్తూ ఇటీవలే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఆదివారం రాజీవ్ కుమార్ సీఈసీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
మొన్నటిదాకా సీఈసీగా కొనసాగిన సుశీల్ చంద్ర శనివారం పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. సుశీల్ పదవీ విరమణతో ఖాళీ అయిన సీఈసీ పోస్టులో ఆదివారం రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 2025 ఫిబ్రవరి వరకు ఈ పదవిలో కొనసాగనున్న రాజీవ్ కుమార్... 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను కూడా నిర్వహించనున్నారు.