AAP: ట్వంటీ20 పార్టీతో ఆప్ పొత్తు... సభకు పోటెత్తిన కేరళ జనం
- కేరళ టూర్‌లో కేజ్రీవాల్
- కూటమికి 'పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్'గా నామకరణం
- 4 కోట్ల మంది మలయాళీల సంక్షేమానికి పాటు పడతామని స్పష్టీకరణ
దేశంలో ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పాలనా పగ్గాలు చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల్లో అధికారం పొందడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... కేరళకు చెందిన ట్వంటీ20 పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ రెండు పార్టీల కూటమికి పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ అంటూ కొత్త పేరు పెట్టారు.
ఈ రెండు పార్టీల మధ్య పొత్తు సందర్భంగా కేరళలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కేరళ జనం పోటెత్తారు. సభకు వచ్చిన జనం సమక్షంలోనే ఆప్, ట్వంటీ20 పార్టీల మధ్య పొత్తును కేజ్రీవాల్ ప్రకటించారు. కొత్తగా ఏర్పాటైన పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ 4 కోట్ల మంది మలయాళీల సంక్షేమానికి పాటు పడుతుందని కేజ్రీవాల్ చెప్పారు.