Sikh Community: పాకిస్థాన్‌లో దారుణం.. ఇద్దరు సిక్కులను కాల్చి చంపిన దుండగులు

Two Members Of Sikh Community Shot Dead By Terrorists In Pakistan

  • సిక్కు వ్యాపారులను కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు
  • రాష్ట్రంలో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రన్న ముఖ్యమంత్రి మహమూద్
  • ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో 15 వేల మంది వరకు సిక్కులు
  • ప్రధాని మోదీ స్పందించాలన్న మాజీ సీఎం అమరీందర్ సింగ్

పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఇద్దరు సిక్కు వ్యాపారులు దారుణ హత్యకు గురయ్యారు. సర్బంద్ పట్టణంలోని బాటా తాల్ బజార్‌లో నిన్న ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి సల్జీత్ సింగ్ (42), రంజీత్ సింగ్ (38)పై కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వ్యాపారులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

సిక్కు వ్యాపారుల హత్యను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఖండించారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రగా దీనిని అభివర్ణించారు.

ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని అయిన పెషావర్‌లో దాదాపు 15 వేల మంది వరకు సిక్కులు నివసిస్తున్నారు. వారిలో అత్యధికులు వ్యాపారులే. వీరిపై దాడులు సర్వసాధారణంగా మారాయి. గతేడాది సెప్టెంబరులో యునానీ వైద్యుడు హకీం, అంతకుముందు ఏడాది ఓ టీవీ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న రవీందర్ సింగ్, 2018లో ప్రముఖ సిక్కు నేత చరణ్‌జీత్ సింగ్, 2016లో జాతీయ అసెంబ్లీ సభ్యుడు సోరెన్ సింగ్‌ను దుండగులు కాల్చి చంపారు.

 కాగా, తాజా హత్యలను పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఖండించారు. పాక్ ప్రభుత్వం సిక్కుల భద్రతకు చర్యలు తీసుకోకుండా నోటి మాటలతోనే సరిపెడుతోందని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని విమర్శించారు. తాజా హత్యల విషయంలో ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించాలంటూ కోరుతూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News