Ashok Gehlot: లబ్ధి పొందే పార్టీలే అల్లర్లను రెచ్చగొట్టేది: రాజస్థాన్ సీఎం గెహ్లాట్
- అల్లర్లతో కాంగ్రెస్ లాభపడుతుందా..? అని ప్రశ్నించిన గెహ్లాట్
- ఇలాంటివి జరిగినప్పుడల్లా కాంగ్రెస్ కే నష్టం కలుగుతోందని వ్యాఖ్య
- దీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్
అల్లర్ల ద్వారా లబ్ధి పొందే పార్టీలే వాటిని ప్రేరేపిస్తుంటాయని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. పలు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న అల్లర్లపై దర్యాప్తు చేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. సోమవారం ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘అల్లర్ల నుంచి కాంగ్రెస్ లాభపడుతుందా..? అల్లర్లు చోటు చేసుకున్న ప్రతిసారి కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగులుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. బీజేపీ హిందూ ఓట్లను సంపాదించుకోగలదు.. కానీ అలా ఎంత కాలం? ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పతాక స్థాయికి చేరాయి. ప్రజలకు ఉద్యోగాలు లేవు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఈ దేశాన్ని నడపడంలో సాయంగా ఉంటున్నాయి. రాజ్యాంగాన్ని కూడా ఛిన్నాభిన్నం చేస్తున్నారు’’ అని గెహ్లాట్ వ్యాఖ్యానించారు.
పలు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న అల్లర్లపై దర్యాప్తునకు ప్యానెల్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖను లోగడ గెహ్లాత్ కోరారు. ఇటీవల శ్రీరామ శోభాయాత్ర సందర్భంగా రాజస్థాన్ లో పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకోవడం తెలిసిందే. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ప్యానెల్ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని గెహ్లాట్ పేర్కొన్నారు.