Narendra Modi: నేపాల్ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని మోదీ... యూపీ సీఎంతో విందు
- నేపాల్ లో మోదీ పర్యటన
- లుంబినిలో మాయాదేవి ఆలయ సందర్శన
- నేపాల్ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు
- విద్యా, సాంస్కృతిక రంగాల్లో ఒప్పందాలు
- లక్నోలో యూపీ క్యాబినెట్ తో భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ పర్యటన ముగిసింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవి ఆలయంలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బాతో కలిసి మోదీ పూజలు నిర్వహించారు. అనంతరం మోదీ, దేవ్ బా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా విద్యా, సాంస్కృతిక రంగాల్లో 6 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేపాల్ కు, రాముడికి విడదీయరాని సంబంధం ఉందని, నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అని పేర్కొన్నారు. అయితే, బుద్ధుడే ఇరుదేశాలను కలుపుతున్నాడని, బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడని, బుద్ధుడు అందరివాడని మోదీ ప్రస్తుతించారు.
కాగా, నేపాల్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ లక్నో చేరుకున్నారు. అక్కడ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో విందులో పాల్గొన్నారు. అనంతరం యూపీ మంత్రులతో రాష్ట్ర పాలనపై చర్చించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ క్యాబినెట్ తో కలిసి మోదీ ఓ గ్రూప్ ఫొటో కూడా దిగారు. ఇటీవలి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించాక మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇది రెండోసారి.
.