Teachers: విశాఖలో ఆందోళన బాట పట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయులు
- ఫ్యాప్టో పిలుపుతో నిరసన చేపట్టిన ఉపాధ్యాయ సంఘాలు
- పీఆర్సీ, సీపీఎస్, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
- ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపాటు
ఫ్యాప్టో ఇచ్చిన పిలుపుతో ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు మహా నిరసన చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విశాఖలోని క్వీన్స్ మేరీ పాఠశాల వద్దకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎస్ రద్దు, పదో తరగతి పరీక్ష పేపర్ల వాల్యుఏషన్, ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ నినదించారు. తమ సమస్యలను ఎన్నో సార్లు ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పీఆర్సీ, డీఏలు, ఇతర రాయితీల్లో ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. పదో తరగతి పరీక్ష పత్రాల వాల్యుయేషన్ కు సంబంధించి గతంలో 50 మార్కుల పేపర్ కు రూ. 6 ఇచ్చేవారని... ఇప్పుడు 100 మార్కుల పేపర్ కు కూడా అంతే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. సీపీఎస్ విషయంలో ఇచ్చిన మాటను సీఎం జగన్ తప్పారని విమర్శించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.