WhatsApp pay: 'వాట్సాప్ పే' లావాదేవీల సమయంలో.. ఇకపై యూజర్ల అసలు పేరు కనిపిస్తుంది!
- బ్యాంకులో ఇచ్చిన చట్టబద్ధమైన పేరు కనిపించేలా మార్పు
- ఎన్ పీసీఐ ఆదేశాలతో మార్పులు చేసినట్టు వాట్సాప్ ప్రకటన
- మోసాల నివారణకు వీలుగా అమల్లోకి కొత్త విధానం
వాట్సాప్ పే సేవలు వినియోగించుకునే వారు.. తమ నుంచి చెల్లింపులు స్వీకరించే అవతలి వ్యక్తి అసలు పేరు తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని వాట్సాప్ ప్రకటించింది. దీంతో చెల్లింపుల స్వీకరణ దారు తన బ్యాంకు ఖాతా కోసం ఇచ్చిన చట్టబద్ధమైన పేరు.. చెల్లింపులు చేసే వారికి కనిపిస్తుంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్ పీసీఐ) ఈ మార్పును తీసుకొచ్చినట్టు వాట్సాప్ యూజర్లకు తెలియజేసింది. దీంతో చెల్లింపుల లావాదేవీల సమయంలో స్వీకరించే వ్యక్తి చట్టబద్ధమైన పేరును డిస్ ప్లే చేయాల్సి ఉంటుందని వాట్సాప్ తెలిపింది. యూపీఐ చెల్లింపుల సిస్టమ్ లో మోసాలను నిరోధించేందుకు ఎన్ పీసీఐ ఈ మార్పును తీసుకొచ్చింది.
యూజర్లు కొన్ని సందర్భాల్లో వేరే పేర్లు, మారు పేర్లను ఫీడ్ చేస్తుంటారు. అయినా, ఇకపై వాట్సాప్ పేమెంట్ సమయంలో మారుపేర్ల స్థానంలో అసలు పేర్లు దర్శనమిస్తాయి. రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఆధారంగా.. వారి బ్యాంకు ఖాతాలో నమోదైన అసలు పేరును లావాదేవీల సమయంలో షేర్ చేయనున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. డబ్బులు పంపిన/చెల్లించిన వారి చట్టబద్ధమైన పేరు సైతం స్వీకరించిన వారికి కనిపిస్తుందని వాట్సాప్ తెలిపింది.