CBI: ట్విట్టర్ హ్యాండిల్‌కు బ్లూ టిక్ పునరుద్ధరించాలంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ పిటిషన్.. జరిమానా విధించిన ఢిల్లీ హైకోర్టు
- ట్విట్టర్ హ్యాండిల్‌కు బ్లూ టిక్ కోసం రెండు సార్లు పిటిషన్
- నాగేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు
- రూ.10 వేల జరిమానా విధింపు
- పిటిషన్ విచారణకు కూడా అనుమతించని హైకోర్టు
- బ్లూ టిక్‌ను పునరుద్ధరించాలని ట్విట్టర్‌కు ఆదేశం
సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్‌గా అతి కొద్దికాలమే పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావుకు ఢిల్లీ హైకోర్టు జరిమానా విధించింది. తన ట్విట్టర్ హ్యాండిల్‌కు ఉన్న బ్లూ మార్క్‌ను ఆ సంస్థ యాజమాన్యం తొలగించిందని, బ్లూ టిక్‌ను పునరుద్ధరించేలా ట్విట్టర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలోనే నాగేశ్వరరావు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ దిశగా తనకు ఫలితం దక్కలేదంటూ నాగేశ్వరరావు తాజాగా మరోమారు ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై మంగళవారం దృష్టి సారించిన ఢిల్లీ హైకోర్టు...పిటిషన్‌పై విచారణకు నిరాకరించింది. అంతేకాకుండా ఒకే అంశంపై వరుసగా రెండు సార్లు ఫిర్యాదు చేస్తారా? అంటూ నాగేశ్వరరావుపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు...ఆయనకు రూ.10వేల జరిమానాను విధించింది. అదే సమయంలో నాగేశ్వరరావు ట్విట్టర్ హ్యాండిల్‌కు బ్లూ టిక్‌ను పునరుద్ధరించాలంటూ ట్విట్టర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన నాగేశ్వరరావు ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారిగా వృత్తి జీవితం ప్రారంభించి 2016లో సీబీఐలో చేరిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్ పదవి కోసం ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య నెలకొన్న వివాదం... ఆ వివాదాన్ని పరిష్కరించే నిమిత్తం నాగేశ్వరరావును కేంద్ర ప్రభుత్వం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. ఈ పదవిలో నాగేశ్వరరావు 2019 జనవరి 11 నుంచి అదే ఏడాది ఫిబ్రవరి 1 దాకా కొనసాగారు.