TDP: జగన్ సర్కారుపై జనంలో వ్యతిరేకత... గడప గడపకులో నిలదీతలే నిదర్శనం: చంద్రబాబు
- టీడీపీ మండల, గ్రామ కమిటీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
- జగన్ సంక్షేమ ఫలాలు బూటకమేనని జనం భావిస్తున్నారని వ్యాఖ్య
- అన్ని వర్గాల్లోనూ జగన్ పై వ్యతిరేకత ఉందన్న బాబు
- కష్టాల్లో ఉన్న ప్రజలు టీడీపీపై నమ్మకం పెట్టుకున్నారని వెల్లడి
వైసీపీ ప్రభుత్వంపై జనంలో అంతకంతకూ వ్యతిరేకత పెరుగుతోందని, ఆ పార్టీ నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమంలో జనం నిలదీతలే ఇందుకు నిదర్శనమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. జనంలో పెరుగుతున్న వ్యతిరేకను గమనించిన జగన్... ఇంకెంతో కాలం ప్రభుత్వాన్ని నడపలేమన్న ఓ అంచనాకు వచ్చారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికలకు జగన్ ప్లాన్ చేసుకుంటున్నారని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ గ్రామ, మండల కమిటీలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఒట్టి బూటకమేనని జనానికి అర్థమైపోయిందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. ఆ వర్గం, ఈ వర్గం అన్న తేడా లేకుండా అన్ని వర్గాల్లోనూ జగన్ సర్కారు పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్న ప్రజలు టీడీపీపైనే నమ్మకం పెట్టుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ శ్రేణులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు.