Vijayasai Reddy: మరోసారి రాజ్యసభకు... సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి
- ఏపీ నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి ఇద్దరికి రాజ్యసభ చాన్స్
- అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ హైకమాండ్
- సీఎం జగన్ చెప్పింది చేయడమే తన విధి అన్న విజయసాయి
వైసీపీ నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి రాజ్యసభ అవకాశం దక్కించుకున్నారు. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. తనపై ఎంతో నమ్మకం ఉంచిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. అచంచల విశ్వాసంతో తనను మళ్లీ రాజ్యసభకు పంపిస్తున్నారని, వారి నమ్మకాన్ని తాను వమ్ముచేయనని, చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తిస్తానని విజయసాయి ఉద్ఘాటించారు.
ఒక ఆడిటర్ గా మొదలైన తన ప్రస్థానం, ఇప్పుడున్న స్థాయి వరకు వచ్చిందని తెలిపారు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే తనకు ప్రాధాన్యతాంశమని స్పష్టం చేశారు. సీఎం అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడమే తన విధి అని పేర్కొన్నారు. కాగా, వచ్చే నెల 22 తర్వాత రాజ్యసభలో వైసీపీ బలం 9కి పెరగనుందని, తద్వారా పార్లమెంటులో వైసీపీ కీలకం కానుందని విజయసాయి అభిప్రాయపడ్డారు.