Rahul Tripathi: రాహుల్ త్రిపాఠి స్పెషల్ ప్లేయర్.. ఫలితాన్ని మార్చేయగలడు: విలియమ్సన్
- అతడు రంగంలోకి దిగితే ఆటతీరే మారిపోతుందన్న విలియమ్సన్
- మ్యాచ్ ను మలుపు తిప్పగలడన్న సన్ రైజర్స్ కెప్టెన్
- ఉమ్రాన్ మాలిక్ పైనా ప్రశంసలు
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి ప్రతిభా పాటవాలను జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మెచ్చుకున్నాడు. అతడ్ని ఒక ప్రత్యేకమైన ఆటగాడిగా అభివర్ణించాడు. మంగళవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 76 పరుగులు సాధించి త్రిపాఠి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ముంబై జట్టుపై సన్ రైజర్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం విలియమ్సన్ మాట్లాడుతూ.. ఎలాంటి ఆట ఫలితాన్ని అయినా మార్చగల సామర్థ్యం త్రిపాఠీకి ఉందన్నాడు. ‘‘నిజానికి అతడు ప్రత్యేకమైన ప్లేయర్. అతడు బ్యాటింగ్ కు దిగితే ఆట తీరునే మార్చేస్తాడు. ఎన్నో సందర్భాల్లో దీన్ని చూశాను’’ అని విలియమ్సన్ తెలిపాడు.
ఉమ్రాన్ మాలిక్ ను సైతం విలియమ్సన్ మెచ్చుకున్నాడు. నిన్నటి మ్యాచ్ లో అతడు రెండు వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2022లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఉమ్రాన్ ఎంతో వేగంగా బంతిని సంధించగలడని, తమ వైపు నుంచి అతను బలమైన ఆయుధమని పేర్కొన్నాడు.