AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం
- ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ సీఎస్ ఉత్తర్వులు
- జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశం
- ఫిబ్రవరి 8 నుంచి జీతభత్యాలను ఇవ్వాలని జీఏడీకి ఆదేశాలు
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ ను ఎత్తివేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆయనకు సూచించింది. మరోవైపు ఫిబ్రవరి 8 నుంచి ఏబీ వెంకటేశ్వరరావుకు జీతభత్యాలను ఇవ్వాలని జీఏడీకి సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ఎత్తివేసి, వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవలే ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయనకు చెల్లించాల్సిన జీతాన్ని కూడా చెల్లించాలని, సస్పెన్షన్ కాలాన్ని కూడా సర్వీసు కింద పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో, ఏపీ చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి వెళ్లి సుప్రీంకోర్టు ఆదేశాలను ఏబీవీ అందించారు. తనను సర్వీసులోకి తీసుకోవాలని వినతిపత్రాన్ని ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఆయనకు సీఎస్ అందుబాటులోకి రాలేదు. దీంతో, ఇటీవలే రెండోసారి సీఎస్ కార్యాలయానికి ఆయన వెళ్లారు. అప్పుడూ కూడా సీఎస్ అందుబాటులో లేకపోవడంతో... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తనను విధుల్లోకి తీసుకోవాలని ఏబీవీ మరోసారి వినతిపత్రాన్ని సీఎస్ కార్యాలయంలో సమర్పించి వచ్చారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది.
ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ తదితర అధికారులపై రెండేళ్లకు మించి సస్పెన్షన్ ఉండరాదు. రెండేళ్లకు మించితే సస్పెన్షన్ ముగిసినట్టే భావించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేరకే సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది.
2020 ఫిబ్రవరి 8న ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. భద్రతా ఉపకరణాల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఆయనను సస్పెండ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7తో రెండేళ్ల సస్పెన్షన్ కాలం పూర్తయింది. దీంతో, ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీసులో ఉన్నట్టు గుర్తించి... ఆయనకు అందాల్సిన ప్రయోజనాలన్నింటినీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ ను ఎత్తివేసింది.