Tollywood: పోకిరి, దూకుడు కన్నా కూడా ‘సర్కారు వారి పాట’ సినిమానే చాలా బాగుంది: సూపర్ స్టార్ కృష్ణ స్పందన
- కొన్ని చానెళ్లు సినిమా బాగాలేదంటూ ప్రచారం చేస్తున్నాయని కృష్ణ విమర్శ
- అప్పటికన్నా ఇప్పుడే మహేశ్ అందంగా ఉన్నాడంటూ వ్యాఖ్య
- నాలుగైదేళ్లుగా పబ్లిక్ లోకి రాలేకపోతున్నానని ఆవేదన
బాక్సాఫీస్ వద్ద మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’ దూసుకుపోతోంది. ఈ సినిమాపై మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్పందించారు. సినిమా చాలా బాగుందని, కానీ, కొన్ని చానెళ్లు మాత్రం సినిమా బాగాలేదంటూ ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. పోకిరి, దూకుడు కన్నా కూడా ‘సర్కారు వారి పాట’ సినిమానే చాలా బాగుందని చెప్పారు. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పోకిరి సినిమాతో పోలిస్తే మహేశ్ బాబు ఇప్పుడే చాలా బాగున్నాడని ఆయన అన్నారు. షూటింగులు లేని సమయాల్లోనూ జిమ్ కు వెళ్తుంటాడని, అలా మెయింటెయిన్ చేస్తున్నాడు కాబట్టే అందంగా ఉన్నాడని చెప్పారు. సామాజిక సమస్యలను సినిమాల్లో స్పృశిస్తుండడం చాలా మంచి విషయమన్నారు.
సుప్రీంకోర్టులో కూడా ఈ సినిమా గురించి మాట్లాడారని, అంతబాగా తీశారని కొనియాడారు. నా రూమ్ లోనే థియేటర్ ఉందని, అందులోనే సినిమాను చూశానని చెప్పారు. నాలుగైదేళ్లుగా పబ్లిక్ లోకి రావడం ఇబ్బంది అవుతోందని, స్ట్రెయిన్ ఎక్కువ పడుతోందని, అందుకే ఇంట్లోనే సినిమా చూశానని చెప్పారు.
సినిమా చూడగానే మహేశ్ కు ఫోన్ చేసి చాలా బాగా నటించావని చెప్పానని తెలిపారు. మహేశ్ చాలా హ్యాపీగా ఉన్నాడని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రను మహేశ్ వంద శాతం చేయబోడని కృష్ణ స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు విప్లవం, ఉద్యమంలోకి వచ్చిన తర్వాతే తెలుసని, తనకు ఆయన బాల్యంపై అవగాహన లేదని అన్నారు. మనవడు గౌతమ్ కు అల్లూరి బాల్యానికి సంబంధించిన పాత్ర సరిగ్గా సూట్ అవుతుందన్న వ్యాఖ్యలపై ఆయన ఈ కామెంట్ చేశారు.
తనను కలిసేందుకు అభిమానులు వస్తుంటారని, వాళ్లందరినీ కలుస్తూ ఉంటానని ఆయన చెప్పారు. ఆంధ్రదేశమంతా గర్వించే గొప్ప నటుడు ఎన్టీఆర్ అని, ఆయన శతజయంతి వేడుకలను గొప్పగా చేయడం సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతివాళ్లూ ఆయన్ను ఆరాధిస్తారని, అభినందించాల్సిన అవసరమూ ఉందని ఆయన వివరించారు.