Lucknow Super Giants: లక్నోపై రెండు పరుగుల తేడాతో ఓడిన కోల్‌కతా.. ప్లే ఆఫ్స్ నుంచి అవుట్
- డికాక్-రాహుల్ దెబ్బకు బద్దలైన పలు రికార్డులు
- లక్నో ప్లే ఆఫ్స్‌కు.. కోల్‌కతా ఇంటికి
- చివరి వరకు పోరాడిన కోల్‌కతా
- ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా డికాక్
ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ కోల్‌కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య గత రాత్రి జరిగిన చివరి లీగ్ మ్యాచ్ అసలైన మజా పంచింది. చివరి బంతి వరకు ఉత్కంఠకు గురిచేసిన ఈ మ్యాచ్‌లో చివరికి లక్నో రెండు పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లగా ఓడిన కోల్‌కతా ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో వికెట్ కోల్పోకుండా 210 పరుగులు చేయగా, కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా కూడా దీటుగానే బదులిచ్చింది. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (0), అభిజీత్ తోమర్ (4) ఇద్దరూ 9 పరుగులకే నిష్క్రమించినప్పటికీ నితీష్ రాణా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సమయోచితంగా ఆడుతూ జట్టును గాడిలో పెట్టారు. బౌలర్లపై విరుచుకుపడుతూ విజయం దిశగా నడిపించారు.
ఈ క్రమంలో 22 బంతుల్లో 9 ఫోర్లతో 42 పరుగులు చేసిన రాణా అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన శామ్ బిల్లింగ్స్ కూడా అదే ఊపు కొనసాగించాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ (50) చేసిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత కాసేపటికే శామ్ బిల్లింగ్స్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు) అవుట్ కావడంతో కోల్‌కతా తడబడింది.
ఆదుకుంటాడనుకున్న ఆండ్రూ రసెల్ (5) కూడా వచ్చిన వెంటనే పెవిలియన్ చేరడంతో కేకేఆర్ ఆశలు అడుగంటాయి. అయితే, రింకూ సింగ్, సునీల్ నరైన్ జట్టును పట్టాలెక్కించి విజయం దిశగా నడిపించి లక్నోకు చెమటలు పట్టించారు. చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 21 పరుగులు అవసరం కాగా, స్టోయినిస్ వేసిన ఆ ఓవర్‌లో రింకూ సింగ్ చెలరేగిపోయాడు. వరుసగా ఫోర్, రెండు సిక్సర్లు, రెండు పరుగులు బాదడంతో కోల్‌కతా విజయం ఖాయమనే అనుకున్నారు. చివరి రెండు బంతులకు మూడు పరుగులు అవసరం కావడంతో కోల్‌కతా విజయం తథ్యమని భావించారు.
అయితే, సరిగ్గా ఇక్కడే కథ అడ్డం తిరిగింది. 15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేసిన రింకూ సింగ్‌ను, ఉమేశ్ యాదవ్ (0)ను స్టోయినిస్ వరుస బంతుల్లో పెవిలియన్ పంపడంతో కోల్‌కతా కథ ముగిసింది. మొత్తంగా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా 208 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఫలితంగా ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్, మార్కస్ స్టోయినిస్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 20 ఓవర్లు ఆడి 210 పరుగులు చేసింది. ఫలితంగా ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా పూర్తిగా 20 ఓవర్లు ఆడిన జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్‌లోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన లక్నో ఇప్పటి వరకు ఏ ఒక్క జట్టుకు సాధ్యం కాని రికార్డును కైవసం చేసుకుంది.
ఓపెనర్లు క్వింటన్ డికాక్, కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇద్దరే క్రీజులో పాతుకుపోయి వీరవిహారం చేశారు. 70 బంతులను ఎదుర్కొన్న డికాక్... 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో అజేయంగా 140 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్.. 51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 పరుగులు రాబట్టాడు. ఫలితంగా ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. వీరిద్దరి దెబ్బకు కోల్‌కతా బౌలర్ సౌథీ 4 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. కాగా, అజేయ సెంచరీతో రికార్డు నెలకొల్పిన డికాక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
డికాక్-రాహుల్ సూపర్ ఇన్నింగ్స్‌తో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్‌లో వికెట్ నష్టపోకుండా ఆడిన తొలి జట్టుగా లక్నో రికార్డులకెక్కగా, తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం అందించిన జంటగా డికాక్-రాహుల్ ఘనత సాధించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 210 పరుగులు జోడించారు. బెయిర్‌స్టో-వార్నర్ నెలకొల్పిన 185 పరుగుల భాగస్వామ్యం రికార్డు ఈ దెబ్బతో బద్దలైంది. అలాగే, డికాక్ అజేయంగా చేసిన 140 పరుగులు ఐపీఎల్‌లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు. గతంలో గేల్ 175, మెక్‌కలమ్ 158 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.