Roja: 'క్విట్ చంద్రబాబు' నినాదంతో ఎన్నికలకు వెళ్తాం: రోజా
- కడపలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న రోజా
- కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేయలేని అసమర్థుడు చంద్రబాబు అంటూ విమర్శలు
- టీడీపీ నేతలు మీడియా ముందు డ్యాన్స్ చేస్తున్నారని ఎద్దేవా
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ, అప్పుడే అన్ని పార్టీల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో కనిపించే హడావుడి ఏపీలో కనిపిస్తోంది. తాజాగా మంత్రి రోజా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'క్విట్ చంద్రబాబు.. సేవ్ ఆంధ్రప్రదేశ్' నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామని ఆమె అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న కడపలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్, వైసీపీ పాలనపై ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ... కుప్పంలో జరిగిన అభివృద్ధి, పులివెందులలో జరిగిన అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను గమనించాలని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.
14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పటికీ కుప్పంను కనీసం రెవెన్యూ డివిజన్ గా కూడా చేయలేని అసమర్థుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. తాము ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నామని... టీడీపీ నేతలు మీడియా ముందు డ్యాన్స్ చేస్తున్నారని విమర్శించారు. ఈ ఉదయం మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ఉషశ్రీ, ఎంపీలు గురుమూర్తి, కృష్ణదేవరాయలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.