Marcus Stoinis: మ్యాచ్ మలుపు తిప్పిన ఆ ఒక్క ఓవర్.. ఒక్క క్యాచ్!
- లక్నో-కోల్ కతా పోరు ఆద్యంతం రసవత్తరం
- చివరి ఓవర్ లో అద్భుతాలు
- మొదటి నాలుగు బంతుల్లో 18 పరుగులు
- చివరి రెండు బంతులకు రెండు వికెట్లు
- ఎవాన్ లెవిస్ అద్భుతమైన క్యాచ్
- లక్నోను వరించిన విజయం
లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. రసవత్తరంగా సాగింది. లక్నో నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని ఢీకొట్టేందుకు కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ చేసిన వీర పోరాటం చూసే వారికి మంచి మజాను ఇచ్చింది. ముఖ్యంగా చివరి ఓవర్ ఎంతో కీలకంగా మారింది. 6 బంతుల్లో 21 పరుగులు కావాల్సిన తరుణం.
బౌలింగ్ చేస్తున్నది మార్కస్ స్టోయినిస్. రింకూ సింగ్ మొదటి నాలుగు బంతులను ఆడి 4, 6, 6, 2 పరుగులు పిండుకున్నాడు. ఇంకా రెండు బాల్స్.. కావల్సింది మూడు పరుగులు. ఇంకేముంది కోల్ కతా గెలిచేసింది అనుకున్నారు. కానీ, చివరి రెండు బంతులకు రెండు వికెట్లు తీశాడు స్టోయినిస్. ఐదో బంతికి రింకూ సింగ్, ఆరో బంతికి ఉమేష్ యాదవ్ అవుటయ్యారు. విజయం లక్నో ఖాతాలో పడిపోయింది.
కానీ, ఈ విజయానికి ఒక క్యాచ్ కీలక మలుపు అని చెప్పుకోవాలి. రింకూ సింగ్ కొట్టిన షాట్ ను ఎవిన్ లెవిస్ అత్యద్భుతంగా ఒంటి చేత్తో పట్టుకున్న తీరు అసాధారణం. మార్కస్ స్టోయినిస్ సైతం ఎవిన్ లెవిస్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును తాము ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఒక్క చేత్తో పట్టాడని, తాను దాన్ని నమ్మలేకున్నానని అన్నాడు. లెవిస్ పట్టిన క్యాచ్ ఈ సీజన్ లో అద్భుతమైన క్యాచ్ లలో ఒకటి కావడం గమనార్హం. మంచి క్యాచ్ లు మ్యాచ్ లను గెలిపిస్తాయని క్వింటన్ డీకాక్ సైతం అన్నాడు.