Second Hand Car: ఈ దొంగ మామూలోడు కాదు... కారును అమ్మినట్టే అమ్మి కొన్ని గంటల్లోనే చోరీ చేశాడు!
- తమిళనాడులో ఘటన
- సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకున్న ఇంజినీరు
- ఆన్ లైన్ లో వెదికిన వైనం
- ఈరోడ్ లో రూ.4.5 లక్షలతో కారు కొనుగోలు
- నిద్రలేచి చూసేసరికి కారు మాయం
తమిళనాడులో ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి కారును అమ్మినట్టే అమ్మి, అదే కారును చోరీ చేసిన ఉదంతం కోయంబత్తూరులో చోటుచేసుకుంది. కోయంబత్తూరులోని గణపతి సుందరం గార్డెన్స్ నివాసి ఎస్.బెనీష్ (26) ఓ సివిల్ ఇంజినీరు. ఓ కారు కొనుక్కోవాలని భావించి, తన బడ్జెట్ కు అనుగుణంగా సెకండ్ హ్యాండ్ కారు కోసం ఆన్ లైన్ లో వెదికాడు. 2021 మోడల్ మారుతి ఈకో వాహనం అమ్మకానికి సిద్ధంగా ఉందంటూ ఆన్ లైన్ లో ఓ ప్రకటన చూశాడు.
అందులో ఉన్న ఫోన్ నెంబరు ఆధారంగా ఆ కారు సొంతదారును బెనీష్ సంప్రదించాడు. కాసేపు బేరమాడిన అనంతరం కారును రూ.4.5 లక్షలకు అమ్మేందుకు అవతలి వ్యక్తి అంగీకరించాడు. ఈరోడ్ పట్టణానికి వస్తే కారును అప్పగిస్తానని బెనీష్ కు తెలిపాడు. ఈ నెల 16న బెనీష్ తన మిత్రుడిని వెంట తీసుకుని ఈరోడ్ వెళ్లాడు. ఆ కారు యజమానిని కలిసి, అతడు చెప్పిన మేరకు నగదు చెల్లించి డాక్యుమెంట్లతో సహా కారును అందుకున్నాడు.
కారు స్పేర్ తాళం చెవి కూడా ఇవ్వాలని బెనీష్ ఆ వ్యక్తిని కోరగా, ఆ కీ బ్యాంకు లాకర్ లో ఉందని, త్వరలోనే తీసుకువచ్చి ఇస్తానని తెలిపాడు. అతడి మాటలతో సంతృప్తి చెందిన బెనీష్ కారుతో సహా కోయంబత్తూరు వచ్చాడు. తాను నివాసం ఉంటున్న సుందరం గార్డెన్స్ వద్ద కారు పార్క్ చేశాడు.
అయితే, మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి కారు కనిపించకపోవడంతో బెనీష్ లబోదిబోమన్నాడు. పొరుగింటివారి సీసీటీవీ ఫుటేజి పరిశీలించగా, ఇద్దరు వ్యక్తులు కారును తీసుకెళ్లిన దృశ్యాలు అందులో కనిపించాయి. దాంతో బెనీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కాగా, తనకెదురైన పరిస్థితి పట్ల బెనీష్ మాట్లాడుతూ, తనకు కారు అమ్మిన వ్యక్తి ఆ కారులో జీపీఎస్ పరికరాలు అమర్చి ఉంటాడని పేర్కొన్నాడు. జీపీఎస్ సాయంతో కారు ఎక్కడ ఉందో కనుక్కుని, కొన్నిగంటల్లోనే దొంగిలించాడని తెలిపాడు.