Musa Yamak: ఇప్పటివరకు ఓటమన్నదే ఎరుగని బాక్సర్... పోటీ మధ్యలో గుండెపోటుతో మృతి
- జర్మనీ బాక్సర్ మూసా యమాక్ ఆకస్మిక మృతి
- గత శనివారం హంజా వాండెరితో బౌట్
- రెండో రౌండ్లో బలమైన పంచ్ విసిరిన వాండెరి
- కాస్త కుదుపుకు గురైన యమాక్
- మూడో రౌండ్ ప్రారంభానికి ముందు ఒరిగిపోయిన వైనం
జర్మనీకి చెందిన చాంపియన్ బాక్సర్ మూసా అస్కన్ యమాక్ విషాదకర పరిస్థితుల్లో మరణించాడు. బాక్సింగ్ రింగ్ లో ఇప్పటిదాకా ఓటమన్నదే ఎరుగని ఆ దిగ్గజ బాక్సర్ ను మృత్యువు ఓడించింది. మూసా యమాక్ వయసు 38 ఏళ్లు.
మ్యూనిచ్ నగరంలో గత శనివారం రాత్రి మూసా యమాక్ ఉగాండాకు చెందిన హంజా వాండెరాతో తలపడ్డాడు. అయితే, మూడో రౌండ్ ప్రారంభానికి ముందు మూసా యమాక్ మెల్లగా ముందుకు ఒరిగిపోయాడు. దాంతో ఈ పోటీని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారే కాదు, ప్రపంచవ్యాప్తంగా లైవ్ లో వీక్షిస్తున్నవారు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు.
కాగా, ఈ పోరు రెండో రౌండ్ లో ప్రత్యర్థి హంజా విసిరిన పంచ్ యమాక్ ను బలంగా తాకింది. దాంతో, అతడి అడుగులు తడబడ్డాయి. సరిగా నిలుచోలేకపోయాడు. అయితే, మూడో రౌండ్ కొన్ని సెకన్లలో ప్రారంభమవుతుందనగా, యమాక్ గుండెపోటుకు గురయ్యాడు. డాక్టర్లు వెంటనే అతడికి ప్రథమ చికిత్స చేయగా, బౌట్ నిర్వాహకులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యమాక్ మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.
మూసా యమాక్ ఇప్పటివరకు ఆడిన 8 ప్రొఫెషనల్ బౌట్లలో గెలుపొందాడు. అన్ని విజయాలు కూడా ప్రత్యర్థిని నాకౌట్ చేయడం ద్వారానే సాధించాడు. జన్మతః టర్కీ జాతీయుడైన మూసా యమాక్ 2017లో ప్రొఫెషనల్ బాక్సర్ అవతారం ఎత్తాడు. 2021లో వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచాక అతడి పాప్యులారిటీ పెరిగిపోయింది. మూసా యమాక్ ఆకస్మిక మృతితో బాక్సింగ్ వర్గాల్లో విషాదం నెలకొంది.