Gannavaram: తాడేపల్లి చేరిన గన్నవరం వైసీపీ పంచాయితీ
- టీడీపీ తరఫున గన్నవరం నుంచి గెలిచిన వంశీ
- ఆ తర్వాత వైసీపీకి దగ్గరైన గన్నవరం ఎమ్మెల్యే
- వంశీ రాకను అడ్డుకోకున్నా... విభేదాలను మాత్రం వదలని దుట్టా
- ఇరు వర్గాలతో తాడేపల్లిలో చర్చలు జరుపుతున్న పార్టీ కీలక నేతలు
ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ శాఖలో చాలా కాలం నుంచి నేతల మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీమోహన్ ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. అయితే ఆది నుంచి నియోజకవర్గ నేతగా కొనసాగుతున్న దుట్టా రామచంద్రరావు... వంశీ చేరికపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయినా పార్టీ ప్రయోజనాల నేపథ్యంలో వైసీపీలో వంశీ చేరికను దుట్టా అడ్డుకోకపోయినా... ఆది నుంచి ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మాత్రం సమసిపోలేదు. ఈ క్రమంలో ఇద్దరు నేతల అనుచరుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే జరుగుతోంది. దీనిపై ఫిర్యాదులు అందుకున్న వైసీపీ అధిష్ఠానం వారిద్దరితో చర్చలకు ఉపక్రమించింది.
ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నుంచి అందిన ఆదేశాల మేరకు కాసేపటి క్రితం వంశీతో పాటు రామచంద్రరావు కూడా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరితో పార్టీ ముఖ్యులు చర్చిస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య విభేదాలు సమసిపోయేలా పార్టీ నేతలు యత్నిస్తున్నారు.