KTR: భారత్‌లో పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ: లండన్ భేటీలో కేటీఆర్
- లండన్ టూర్‌లో బిజీబిజీగా కేటీఆర్
- వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ఇండియా ప్రతినిధులతో భేటీ
- తెలంగాణలో పెట్టుబడులకు గల సానుకూలతల వివరణ
లండన్ టూర్‌లో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆయా పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం వెస్ట్ మిడ్ ల్యాండ్స్ ఇండియా పార్టనర్‌షిప్ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. భారత్, మధ్య ప్రాచ్యం మధ్య వాణిజ్య కార్యకలాపాల వృద్ధే లక్ష్యంగా వెస్ట్ మిడ్ ల్యాండ్స్ ఇండియా పార్టనర్‌షిప్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ భేటీలో భాగంగా కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ఏ సంస్థకైనా గమ్యస్థానం తెలంగాణేనని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని ప్రోత్సాహకాలతో పాటు ఏ రంగానికి చెందిన పరిశ్రమకైనా తెలంగాణలో విస్తృత అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఐటీ రంగంలో మానవ వనరులకు హైదరాబాద్ అడ్డాగా ఉందని, ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు పలు ఐటీ దిగ్గజాలు వస్తున్నాయని కూడా ఆయన తెలిపారు.