YSRCP: వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ జూన్ 13కి వాయిదా
- బెయిల్ కోసం హైకోర్టులో వివేకా హత్య కేసు నిందితుల పిటిషన్లు
- ఇప్పటికే రెండు సార్లు విచారించిన హైకోర్టు
- ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉందంటూ సీబీఐ వాదనలు
- పిటిషన్లపై రెగ్యులర్ కోర్టులో విచారిస్తామన్న హైకోర్టు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణను జూన్ 13కు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న శివశంకర్‌రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్‌లు తమకు బెయిల్ ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లపై ఇప్పటికే రెండు సార్లు విచారణ చేపట్టిన హైకోర్టు.. గత విచారణ సందర్భంగా ఎప్పటిలోగా ఈ కేసు దర్యాప్తును సీబీఐ పూర్తి చేస్తుందని ప్రశ్నించింది. గురువారం నాటి విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉందని, దీంతో ఈ కేసు దర్యాప్తు ఎప్పటిలోగా పూర్తి అవుతుందన్న విషయం ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు... ఈ పిటిషన్లపై ఇక రెగ్యులర్ కోర్టులోనే విచారిస్తామని చెప్పి... తదుపరి విచారణను జూన్ 13కు వాయిదా వేసింది.