Royal Challengers Bangalore: ఫామ్‌లోకి వచ్చి జట్టును గెలిపించిన కోహ్లీ.. రేసులోనే బెంగళూరు
- తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఆర్సీబీ
- చాన్నాళ్ల తర్వాత బ్యాట్ ఝళిపించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్న కోహ్లీ
- 169 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదన
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ కోహ్లీ చెలరేగాడు. ఇన్నాళ్లూ ఫామ్ కోల్పోయి తంటాలు పడిన విరాట్ బ్యాట్‌తో చెలరేగాడు. జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలిపాడు. గత రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టైటాన్స్ నిర్దేశించిన 169 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
విరాట్ కోహ్లీ మునుపటి దూకుడు ప్రదర్శిస్తూ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, కెప్టెన్ ఫా డుప్లెసిస్ 38 బంతుల్లో 5 ఫోర్లతో 44 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ మరోమారు చెలరేగిపోయాడు. 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 40 పరుగులు చేయడంతో ఆర్సీబీ 18.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. బెంగళూరు కోల్పోయిన రెండు వికెట్లు రషీద్ ఖాన్ ఖాతాలోకే వెళ్లాయి. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో బెంగళూరు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి తిరిగి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హార్దిక్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేసింది. హార్దిక్ పాండ్యా 47 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ 25 బంతుల్లో 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు. వృద్ధిమాన్ సాహా 31, మాథ్యూ వేడ్ 16 పరుగులు చేశారు. చివర్లో రషీద్ ఖాన్ 6 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 19 పరుగులు చేశాడు.
బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన గుజరాత్‌కు ఇది నాలుగో ఓటమి. ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం రన్‌రేట్ కీలకంగా మారుతుంది.