Telangana: దేశవ్యాప్త పర్యటనలో భాగంగా నేడు ఢిల్లీకి కేసీఆర్.. షెడ్యూల్ ఇలా..!
- ఢిల్లీలో వివిధ పార్టీల నేతలు, ఆర్థికవేత్తలతో సమావేశం
- రైతు ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలకు చెక్కుల పంపిణీ
- బెంగళూరులో దేవెగౌడ, కుమారస్వామిలతో సమావేశం
- అన్నాహజారేతో భేటీ అనంతరం షిరిడీకి
- హైదరాబాద్ వచ్చాక మళ్లీ బీహార్, బెంగాల్ పర్యటన
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దేశవ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి 8 రోజులపాటు ఆయన పర్యటన సాగనుంది. ఇందులో భాగంగా నేటి మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తారు. వివిధ పార్టీల నేతలు, ఆర్థిక వేత్తలతో అక్కడ సమావేశమవుతారు. దేశ ఆర్థిక పరిస్థితులపైనా చర్చిస్తారు. అలాగే, జాతీయ మీడియా సంస్థలతోనూ సమావేశమవుతారు.
ఇక 22న మధ్యాహ్నం చండీగఢ్ చేరుకుంటారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన దాదాపు 600 మంది కుటుంబాలను ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లతో కలిసి పరామర్శిస్తారు. అనంతరం ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తారు.
26న బెంగళూరు చేరుకుని మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతో సమావేశమవుతారు. 27న రాలేగావ్ సిద్ధి వెళ్లి అన్నాహజారేతో భేటీ అవుతారు. అనంతరం అక్కడి నుంచి షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత మళ్లీ 29 లేదంటే 30వ తేదీలలో పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా గల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనికుల కుటుంబాలను పరామర్శిస్తారు.