Wheat: దేశంలో గోధుమ దిగుబడుల తగ్గుదల.. ఇదే కారణమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం
- 3 శాతం పడిపోతుందన్న వ్యవసాయ శాఖ
- 10.9 కోట్ల టన్నుల నుంచి 10.6 కోట్లకు తగ్గుతుందని వెల్లడి
- ఉష్ణోగ్రతలు పెరగడం వల్లేనని వెల్లడి
- పంటల ఉత్పత్తిపై మూడో అంచనా నివేదిక
ఈ ఏడాది గోధుమల ఉత్పత్తి తగ్గిపోనుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3 శాతం మేర తగ్గిపోతుందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. 10.6 కోట్ల టన్నులకు పడిపోతుందని పేర్కొంది. 2014–15 నుంచి గోధుమ దిగుబడి తగ్గిపోవడం ఇదే తొలిసారి అని, దిగుబడి పడిపోవడానికి కారణం వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమేనని చెప్పింది.
గత ఏడాది 10.9 కోట్ల టన్నుల గోధుమల దిగుబడి రాగా.. ఈ ఏడాది 11.1 కోట్ల టన్నులు వస్తుందని ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, ఇప్పుడు వేసవి కాలం త్వరగా వచ్చినందున గోధుమల ఉత్పత్తి 10.5 కోట్ల టన్నులకు పడిపోతుందని మొన్న రాత్రి ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే చెప్పారు.
అయితే, తాజా నివేదికలో మాత్రం 3 శాతం పడిపోయి 10.6 కోట్ల టన్నుల గోధుమలు వస్తాయని నిన్న విడుదల చేసిన ఆహారధాన్యాలు, చెరకు, నూనె గింజలు, పత్తి, జూట్ ఉత్పత్తి మూడో అంచనా నివేదికలో వ్యవసాయ శాఖ పేర్కొంది. గోధుమల దిగుబడి తగ్గినా మొత్తం ఆహార ధాన్యాల దిగుబడులు మాత్రం పెరుగుతాయని తెలిపింది. మొత్తం 31.4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వస్తాయంది. వరి, జొన్న, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందని చెప్పింది.