RR: చెన్నైని కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్... మొయిన్ అలీ సూపర్ ఇన్నింగ్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 రన్స్
- మొయిన్ అలీ ఒంటరిపోరాటం
- 57 బంతుల్లో 93 పరుగులు
- 13 ఫోర్లు, 3 సిక్సులు బాదిన మొయిన్
- రెండేసి వికెట్లు తీసిన చహల్, మెక్ కాయ్
ముంబయి బ్రాబౌర్న్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ ప్రదర్శన కనబర్చారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, రాజస్థాన్ బౌలర్లు రాణించడంతో భారీ స్కోరు సాధించలేకపోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది.
అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా, చెన్నై ఆటగాడు మొయిన్ అలీ ఒంటరిపోరు సాగించాడు. మొయిన్ అలీ 57 బంతుల్లోనే 93 పరుగులు చేయడం విశేషం. ఇతర బ్యాట్స్ మెన్ విఫలమైనా, మొయిన్ మాత్రం ఎక్కడా దూకుడు తగ్గించలేదు. ఈ ఇంగ్లండ్ ఆటగాడి స్కోరులో 13 ఫోర్లు, 3 భారీ సిక్సులు ఉన్నాయి.
కెప్టెన్ ధోనీ 28 బంతుల్లో 26 పరుగులు చేయగా, ఓపెనర్ డెవాన్ కాన్వే 16 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (2) ఆరంభంలోనే అవుట్ కాగా, ఎన్.జగదీశన్ (1), అంబటి రాయుడు (3) విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యజువేంద్ర చహల్ 2, ఒబెద్ మెక్ కాయ్ 2, ట్రెంట్ బౌల్ట్ 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.