kakinada: బారికేడ్లు తోసుకుని దూసుకెళ్లిన టీడీపీ నేతల బృందం.. కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత
- వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ ను అరెస్టు చేయాలని డిమాండ్
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఆందోళన
- ప్రస్తుతం కొనసాగుతోన్న పోస్టుమార్టం ప్రక్రియ
తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ వద్ద డ్రైవర్‌గా పనిచేసే కాకినాడకు చెందిన వీధి సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో సుబ్రహ్మణ్యం మృతదేహానికి కాకినాడ జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఆసుపత్రికి టీడీపీ నిజనిర్ధారణ బృందం వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎవ్వరూ రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వాటిని తోసుకుని ముందుకు వెళ్లారు టీడీపీ నేతలు.
ఆ తర్వాత మార్చురీ గదిలోకి చొచ్చుకు వెళ్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో.. టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా, వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, జీజీహెచ్ వద్ద ప్రజా సంఘాలు, ఎస్సీ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు మాట్లాడుతూ.. ఈ కేసులో తమపై ఎవరి నుంచీ ఎటువంటి ఒత్తిళ్లూ లేవని, పోస్టుమార్టం సక్రమంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.