Davos: దావోస్ సదస్సులో ఏపీ పెవిలియన్ ఇలా!... పక్కనే తమిళనాడు పెవిలియన్!
- రేపటి నుంచి దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు
- సదస్సుకు వెళ్లిన ఏపీ ప్రతినిధి బృందానికి సీఎం జగన్ నేతృత్వం
- ఇప్పటికే దావోస్‌లో వెలసిన ఏపీ పెవిలియన్
ప్రపంచ ఆర్థిక సంస్థ (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) సదస్సు దావోస్‌లో ఆదివారం (ఈ నెల 22) ప్రారంభం కానుంది. ఈ నెల 26 దాకా కొనసాగనున్న ఈ సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ హాజరు అవుతుండగా...ఆయా కంపెనీలను తమ దేశాల్లో, రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టే దిశగా ఒప్పించేందుకు ఆయా ప్రభుత్వాల ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం కూడా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందాన్ని పంపింది.
ఇదిలా ఉంటే.. దావోస్ సదస్సులో ఏపీ పెవిలియన్ ఎలా ఉందన్న విషయాన్ని ఈ-ప్రగతి అథారిటీకి సీఐఓగా వ్యవహరిస్తున్న హర్షవర్ధన్ రెడ్డి వెల్లడించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో వెలసిన ఏపీ పెవిలియన్ ఫొటోలను ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ పెవిలియన్ నుంచి ఏపీ ప్రతినిధి బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించనుంది.
ఇక ఈ సదస్సుకు దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇలా దావోస్ చేరిన తమిళనాడు ప్రతినిధి బృందం కూడా తమ పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. ఏపీ, తమిళనాడు పెవిలియన్లు పక్కపక్కనే ఏర్పాటు అయ్యాయి.