Honour Killing: బేగం బజార్ పరువు హత్య కేసు నిందితుల అరెస్ట్
- మచ్చి మార్కెట్‌లో నీరజ్ దారుణ హత్య
- నీరజ్ భార్య సంజన సోదరుడే ప్రధాన నిందితుడు
- హత్య తర్వాత 2 బైకులపై కర్ణాటక పారిపోయిన నిందితులు
- నిందితులు సహా మరొకని అరెస్ట్ చేసిన పోలీసులు
బేగం బజార్‌లో శుక్రవారం జరిగిన పరువు హత్యకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో నీరజ్ పన్వార్ అనే యువకుడిని శుక్రవారం బేగం బజార్ పరిధిలోని మచ్చి మార్కెట్‌లో ఐదుగురు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుడి భార్య సంజన సోదరుడే ప్రధాన నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. ఘటన జరిగిన వెంటనే నిందితుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు... మచ్చి మార్కెట్ పరిధిలోని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల బైక్‌లను గుర్తించారు.
నీరజ్‌ను హత్య చేసిన మరుక్షణం రెండు బైకులపై పరారైన నిందితులు తెలంగాణ సరిహద్దు రాష్ట్రం కర్ణాటకకు పరారయ్యారు. వీరి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు వారు వినియోగించిన బైకులు కర్ణాటక పరిధి ఉన్నట్టుగా గుర్తించారు. ఆ వెంటనే కర్ణాటక పోలీసులను అలెర్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు... కేవలం గంటల వ్యవధిలోనే నిందితులతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని కర్ణాటక నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. నీరజ్ హత్యకు పాల్పడ్డ వారిని రోహిత్, రంజిత్, కౌశిక్, విజయ్ గా గుర్తించిన పోలీసులు వారితో కలిసి ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.