Haryana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. హర్యానా మాజీ సీఎం చౌతాలను దోషిగా ప్రకటించిన కోర్టు
- 1993-2006 మధ్య కాలంలో రూ. 6.09 కోట్లు అక్రమంగా కూడగట్టుకున్నారని అభియోగాలు
- 2005లో నమోదైన కేసు
- ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణంలో ఇప్పటికే పదేళ్ల జైలు శిక్ష అనుభవించిన చౌతాలా
- హర్యానాకు నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన చౌతాలా
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ నేరానికి ఎంతమేరకు శిక్ష విధించాలన్న దానిపై ఈ నెల 26న కోర్టు వాదనలు విననుంది. కోర్టు తనను దోషిగా ప్రకటించినప్పుడు చౌతాలా కోర్టులో ఉన్నారు. 1993-2006 మధ్య కాలంలో చౌతాలా 6.09 కోట్లు కూడగట్టుకున్నారని, ఆయన ఆదాయానికి, దీనికి పొంతన లేదంటూ 17 ఏళ్ల క్రితం 2005లో సీబీఐ కేసు నమోదు చేసింది. 2010లో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
కాగా, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణంలో దోషిగా తేలిన చౌతాలా ఇప్పటికే పదేళ్ల జైలు శిక్ష అనుభవించారు. గతేడాది తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలులో ఉన్నప్పుడే పది, 12వ తరగతులు చదివి పాసయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక గ్రామాల్లో పర్యటిస్తూ తన పార్టీ ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన మరో కేసులో దోషిగా తేలడం ఆయనకు శరాఘాతమే. చౌతాలా 1995 నుంచి 2005 వరకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా ఏడుసార్లు విజయం సాధించారు.