Imran Khan: పెట్రో ధరలు తగ్గించిన కేంద్రం.. మోదీని మరోమారు ప్రశంసించిన ఇమ్రాన్ ఖాన్
- పెట్రో ధరలను తగ్గించడంపై స్పందించిన ఇమ్రాన్
- అమెరికా ఒత్తిడిని ఎదుర్కొని మరీ ప్రజల కోసం రష్యన్ చమురును కొనుగోలు చేస్తోందని ప్రశంసలు
- పాక్ ప్రభుత్వం తలలేని కోడిలా నడుస్తోందని ధ్వజం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుంచి రాయితీపై చమురు కొనుగోలు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుందని అన్నారు. భారతదేశం ‘క్వాడ్’లో భాగమైనప్పటికీ యూఎస్ నుంచి ఒత్తిడి ఎదుర్కొని ప్రజల కోసం రాయితీపై రష్యన్ చమురును కొనుగోలు చేసిందంటూ ఇమ్రాన్ ట్వీట్ చేశారు.
పాకిస్థాన్‌లోని తమ ప్రభుత్వం కూడా ఇది సాధించేందుకు కృషి చేసిందని అన్నారు. స్వతంత్ర విదేశాంగ విధానం సాయంతో తమ ప్రభుత్వం కూడా కృషి చేసిందన్నారు. అలాగే, పాకిస్థాన్ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) నేతృత్వంలోని ప్రభుత్వం ‘ఆర్థిక వ్యవస్థతో తల లేని కోడి’లా నడుస్తోందని దుయ్యబట్టారు.