India: అదే మన దేశానికి కొత్త శక్తి.. థామస్ కప్ గెలిచిన బ్యాడ్మింటన్ ఆటగాళ్లతో ప్రధాని ఆత్మీయ సమావేశం
- తలుచుకుంటే ఏదైనా సాధించగలమన్న యాటిట్యూడే కావాలని సూచన
- ఆటగాళ్లకు అండగా ఉంటామని హామీ
- పతకం సాధించడం చిన్న విషయం కాదన్న మోదీ
థామస్ కప్ లో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆత్మీయంగా సమావేశమయ్యారు. ‘‘అవును, తలుచుకుంటే మనం ఏదైనా సాధించగలం. ఆ యాటిట్యూడే మన దేశానికి కొత్త శక్తి అయింది’’ అని క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారు. క్రీడాకారులందరికీ అవసరమైన మద్దతునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశం తరఫున ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఓ పతకం సాధించడం చిన్న విషయం కాదని మోదీ అభినందించారు.
అథ్లెట్లు ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. 73 ఏళ్ల తర్వాత థామస్ కప్ గెలవడం ఆనందంగా ఉందని హెచ్ ఎస్ ప్రణయ్ అన్నాడు. క్వార్టర్ ఫైనల్ లో కొంచెం ఒత్తిడి ఉందని, కానీ, అది ఓడితే పతకం చేజారిపోతుందన్న విషయాన్ని మనసులో ఉంచుకుని ఆడామని చెప్పాడు. ప్రధాని మోదీ పతకం గెలిచిన వాళ్లు, గెలవని వాళ్ల మధ్య ఎప్పుడూ తేడాలు చూపరని 14 ఏళ్ల యువ అథ్లెట్ ఉన్నతి హూడా చెప్పుకొచ్చింది. తర్వాతి సీజన్ లో మహిళల టీం కూడా పతకం గెలుస్తుందని చెప్పింది.
క్రీడాకారులకు ప్రధాని మద్దతు ఉంటుందని చెప్పేందుకు గర్వపడుతున్నానని కిదాంబి శ్రీకాంత్ పేర్కొన్నాడు. మ్యాచ్ అయిపోగానే తమతో ఆయన మాట్లాడిన తీరే అందుకు నిదర్శనమన్నాడు. ఆయన మాటలు ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతాయన్నాడు. కాగా, బ్యాడ్మింటన్ క్రీడాకారులతో పాటు వారి కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ప్రధానిని కలిసిన వారిలో ఉన్నాడు.
కాగా, గత ఆదివారం థామస్ కప్ ఫైనల్ లో ఇండోనేషియా జట్టును 3–0 తేడాతో మట్టికరిపించి భారత జట్టు బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. 73 ఏళ్ల తర్వాత తొలిసారి థామస్ కప్ లో పతకం సాధించి రికార్డ్ సృష్టించింది.