Ayyanna Patrudu: సుబ్రహ్మణ్యంను కొట్టిచంపారని ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది... మరి అనంతబాబును కాపాడ్డానికి ప్రయత్నించింది ఎవరు?: అయ్యన్నపాత్రుడు

Ayyanna responds to driver subrahmanyam death issue

  • సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి
  • వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో శవం
  • హత్యేనని తేలిందని అయ్యన్న వెల్లడి
  • జగన్ కు దమ్ముంటే సీబీఐ విచారణ వేయాలని డిమాండ్

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. సుబ్రహ్మణ్యం మరణానికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన నేపథ్యంలో అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కొట్టి చంపి, స్వయంగా తన కారులోనే మృతుడి ఇంటికి మృతదేహాన్ని తీసుకువచ్చాడని ఆరోపించారు. అంతేకాకుండా, సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడని వివరించారు.

అయితే, ఇది ప్రమాదం కాదని, కొట్టి చంపారని కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, దళిత సంఘాలు మూడు రోజుల నుంచి పోరాడినట్టు అయ్యన్న తెలిపారు. దాంతో సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం చేశారని వెల్లడించారు. కొట్టడం వల్లే సుబ్రహ్మణ్యం చనిపోయాడని ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక ఇచ్చారని తెలిపారు. 

ఈ నేపథ్యంలో, గత మూడ్రోజులుగా నిందితుడు అనంతబాబును కాపాడాలని ప్రయత్నించింది ఎవరు? అంటూ అయ్యన్న నిలదీశారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందో తేలాలంటే సీబీఐ విచారణ జరపాలని స్పష్టం చేశారు. జగన్ కు దమ్ముంటే ఈ కేసును సీబీఐకి ఇచ్చి బాధిత కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News