PBKS: నామమాత్రపు మ్యాచ్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ ఘన విజయం
- పంజాబ్ ఆల్‌రౌండ్ షో
- 5 వికెట్ల తేడాతో ఘన విజయం
- ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా హర్‌ప్రీత్ బ్రార్
- రేపటి నుంచి ప్లే ఆఫ్స్ సమరం
సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య గత రాత్రి జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ లీగ్ దశ ముగిసింది. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బంతితో హైదరాబాద్‌ను 157 పరుగులకే కట్టడి చేసిన పంజాబ్ ఆపై 29 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. లియామ్ లివింగ్ స్టోన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 49 (నాటౌట్) పరుగులు చేయగా బెయిర్‌స్టో 23, శిఖర్ ధావన్ 39, షారూఖ్ ఖాన్ 19, జితేష్ శర్మ 19 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఫజల్లాక్ ఫరూకీ రెండు వికెట్లు తీసుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బార్ బౌలింగ్ దెబ్బకు వికెట్లు టపటపా రాల్చుకున్న హైదరాబాద్ బ్యాటర్లు పరుగులు రాబట్టుకోవడంలో విఫలమయ్యారు. అభిషేక్ శర్మ (43), త్రిపాఠి (20), మార్కరమ్ (21), వాషింగ్టన్ సుందర్ (25), రొమారియో (26) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మూడు కీలక వికెట్లు పడగొట్టిన హర్‌ప్రీత్ బ్రార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ ఏడు విజయాలు, 14 పాయింట్లతో ఆరో స్థానంతో ఈ సీజన్‌ను ముగించింది. హైదరాబాద్ 6 విజయాలు, 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఇక రేపటి నుంచి ప్లే ఆఫ్స్ సమరం మొదలుకానుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది.
25న లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య అదే స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. 27న క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుతో తలపడుతుంది. ఈ నెల 29న అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.