- క్యాన్సర్ కు రేడియోథెరపీ మొదలైందంటూ పోస్ట్
- నాలుగు వారాల పాటు కొనసాగుతుందని వెల్లడి
- ఈ ప్రయాణాన్ని జయించాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటన
బ్రెస్ట్ కేన్సర్ బారిన పడిన సినిమా, టీవీ నటి ఛావి మిట్టల్ రేడియేషన్ థెరపీ గురించి తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ బయటపడినట్టు గత నెలలో ప్రకటించడం తెలిసిందే. కేన్సర్ పై అవగాహన కల్పించాలని కూడా ఆమె నిర్ణయించుకుంది. అందుకని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన స్వీయ అనుభవాలను పంచుకోనుంది.
రేడియో థెరపీ, దాని దుష్ప్రభావాల గురించి తాను ఆందోళనకు గురైనట్టు ఆమె చెప్పింది. అయినా, ఈ ప్రయాణాన్ని జయించాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. ‘‘నా రేడియో థెరపీ ఈ రోజే మొదలైంది. కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయని, వాటితో అంత సౌకర్యంగా ఉండకపోవచ్చని నాకు చెప్పారు. కీమో లేదా రేడియోథెరపీ అన్నది పేషెంట్ ఎంపికే అని చాలా మంది అన్నారు. సాంకేతికంగా అనుమతి పత్రంపై సంతకం చేయడమే మనం చేయాల్సింది. మొత్తానికి చికిత్స ఏంటన్నది మీ డాక్టర్ నిర్ణయించాల్సిందే. డాక్టర్ దృష్టి ప్రాణాలు కాపాడడంపైనే కానీ, దుష్ప్రభావాల గురించి కాదు’’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
20 సైకిల్స్ పాటు రేడియేషన్ ను.. వారంలో ఐదు రోజుల చొప్పున, వచ్చే నాలుగు వారాల పాటు ఇవ్వనున్నట్టు ఛావి మిట్టల్ వెల్లడించింది. దుష్ప్రభావాల గురించి కాకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నట్టు తెలిపింది. తన హావభావాలను వ్యక్తం చేస్తూ అతి స్వల్ప నిడివితో ఉన్న వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. (
వీడియో కోసం)