NMC: వైద్యులు ఇక జనరిక్ మందులే రాయాలి.. రోగులకు మందులు అమ్ముకోవచ్చు: జాతీయ వైద్య కమిషన్

NMC Release Framework on Doctors practice

  • వృత్తి నియమావళి ముసాయిదాను ప్రకటించిన ఎన్ఎంసీ
  • జూన్ 22వ తేదీ లోగా సలహాలు, సూచనలు తెలియజేయాలని సూచన
  • అనవసరమైన మందులు, కాంబినేషన్స్ రాయకూడదన్న ఎన్ఎంసీ
  • ఆపరేషన్ల సమయంలో రోగి నుంచి అంగీకారపత్రం తీసుకోవడం తప్పనిసరి

వైద్యులు ఇకపై జనరిక్ మందులే రాయాలని, షాపులు పెట్టి మందులు విక్రయించకూడదని చెబుతూ నేషనల్ మెడికల్ కమిషన్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ప్రొఫెషనల్ కాండక్ట్) రెగ్యులేషన్-2022 పేరుతో జాతీయ వైద్య కమిషన్ ఓ నియమావళిని తన వెబ్‌సైట్‌లో పెట్టింది. వైద్యుల వృత్తి నియమావళి ముసాయిదాపై ఏవైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే వచ్చే నెల 22 లోగా తమకు తెలియజేయాలని కోరింది.

 ఎన్ఎంసీ నియమావళి ప్రకారం..  వైద్యులు బ్రాండెడ్ మందులను రాయకూడదు. బదులుగా జనరిక్ మందులనే రాయాలి. అనవసరమైన మందులు, కాంబినేషన్స్ సిఫార్సు చేయకూడదు.  అలాగే, వైద్యులు మందుల షాపులు పెట్టి రోగులకు ఔషధాలను విక్రయించకూడదు. అయితే, తన వద్దకు వచ్చే రోగులకు మాత్రం అవసరమైన మందులను విక్రయించవచ్చు.

ఒక వైద్యుడు రాసిన మందులను మరో వైద్యుడు రోగులకు విక్రయించకూడదు. ఆపరేషన్‌కు ముందు రోగుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకోవాలి. రోగికి ఒకవేళ అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చిన సందర్భంలో అతడి అటెండెంట్స్ ఎవరూ లేకపోతే వైద్యుడే నిర్ణయం తీసుకోవచ్చని ఎన్ఎంసీ తన ముసాయిదాలో పేర్కొంది. అలాగే, రోగికి ఒకేసారి రెండుమూడు ఆపరేషన్లు చేయాల్సి వచ్చిన సందర్భంలో అవేంటో, ఎందుకు చేయాలో చెబుతూ రోగి నుంచి అంగీకార పత్రం తీసుకోవాలి. 

తన వద్దకు వచ్చిన పేషెంట్‌కు చికిత్స ఖర్చు ఎంత అవుతుందో ముందుగానే చెప్పాలి. ఆ మొత్తాన్ని అతడు భరించలేకుంటే చికిత్స నిరాకరించే హక్కు వైద్యులకు ఉండదు. అన్నింటికంటే ముఖ్య విషయం.. బహుళజాతి ఫార్మా కంపెనీల నుంచి తాము ఎలాంటి ప్రతిఫలం పొందలేదని నిర్ధారిస్తూ వైద్యులు ఓ అఫిడవిట్‌ను ప్రతి ఐదేళ్లకోసారి ఎన్ఎంసీకి ఇవ్వాల్సి ఉంటుంది. రోగుల వివరాలను చట్టపరంగా అవసరమైతే తప్ప ఎట్టిపరిస్థితుల్లోనూ బహిరంగంగా వెల్లడించకూడదు. ఎన్ఎంసీ వైద్య వృత్తి నియమావళిని అతిక్రమిస్తే మాత్రం వైద్యుల లైసెన్స్‌ను రద్దు చేస్తారు.

  • Loading...

More Telugu News