TSRTC: టీఎస్ఆర్టీసీ వినూత్న ఆలోచన.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సమీపంలోని బస్టాప్‌లకు విద్యుత్ వాహనాలు
- మరో వారం పది రోజుల్లోనే అందుబాటులోకి
- రైల్వే స్టేషన్ నుంచి నేరుగా సమీపంలోని బస్టాప్‌లకు
- పూర్తి ఉచితంగా ప్రయాణం
తెలంగాణ ఆర్టీసీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సమీపంలోని బస్టాప్‌లకు ప్రయాణికులను ఉచితంగా చేరవేసేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అల్ఫా హోటల్, రేతిఫైల్ బస్టాండ్, బ్లూసీ హోటల్ ఎదురుగా ఉండే ఉప్పల్ బస్టాప్, మెట్టుగూడ, చిలకలగూడ, గాంధీ ఆసుపత్రివైపు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని రైల్వే స్టేషన్‌లో ఇరువైపులా ఉన్న ప్లాట్‌ఫామ్స్‌పై ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు రైలు దిగగానే వాటి వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలో చెబితే బ్యాటరీ వాహనాలు రప్పిస్తారు. అక్కడి నుంచి సమీపంలోని బస్టాప్‌లో వదిలిపెడతారు. మెట్రో రైలులో వెళ్లాలనుకుంటే కనుక అదే విషయం చెబితే అక్కడే దిగబెడతారు. మరోవారం పది రోజుల్లోనే ఈ ఉచిత వాహన సేవలు అందుబాటులోకి రానున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.