Punjab: అవినీతిపై ఉక్కుపాదం.. మంత్రిని డిస్మిస్ చేసిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్!
- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిపై వేటు
- కాంట్రాక్టర్ల నుంచి ఒక శాతం కమిషన్ డిమాండ్ చేసిన వైనం
- స్పష్టమైన ఆధారాలు లభించడంతో డిస్మిస్ చేసిన సీఎం
ఆప్ పార్టీ అంటేనే అవినీతికి పూర్తి వ్యతిరేకం. అవినీతికి వ్యతిరేకంగానే ఆ పార్టీ పుట్టుకొచ్చింది. ప్రజల ఆదరణను చూరగొంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ అవినీతి రహిత పాలనను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ లో సైతం ఆప్ అధికారంలోకి వచ్చింది. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంతకు ముందే హెచ్చరించారు. చెప్పినట్టుగానే ఒక అవినీతి మంత్రిపై వేటు వేశారు.
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విజయ్ సంగ్లాను భగవంత్ మాన్ డిస్మిస్ చేశారు. కమిషన్ తీసుకున్నారన్న నేపథ్యంలో కఠినమైన చర్య తీసుకున్నారు. కాంట్రాక్టులకు సంబంధించి ఒక శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారంటూ స్పష్టమైన ఆధారాలు లభించడంతో మంత్రివర్గం నుంచి ఆయనను డిస్మిస్ చేశారు.