Wasim Raja: కశ్మీర్ యువకుడ్ని కోటీశ్వరుడ్ని చేసిన డ్రీమ్ 11 యాప్
- పేద కుటుంబానికి చెందిన వసీమ్ రజాకు జాక్ పాట్
- బిజ్ బెహరా ప్రాంతంలో నివసిస్తున్న యువకుడు
- డ్రీమ్ 11 యాప్ లో రజా ఎంపిక చేసిన జట్టుకు ఫస్ట్ ప్లేస్
- సమాచారం అందించిన స్నేహితుడు
ఐపీఎల్ మ్యాచ్ లు టీవీలో చూస్తున్నప్పుడు మధ్యలో డ్రీమ్ 11 యాప్ వాణిజ్య ప్రకటన రావడం, క్రికెటర్లు ఆ యాప్ గురించి ప్రచారం చేయడం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫాంటసీ క్రికెట్ యాప్ ద్వారా జమ్మూకశ్మీర్ కు చెందిన ఓ యువకుడు కోటీశ్వరుడు అయ్యాడు. అతడి పేరు వసీమ్ రజా. జమ్మూకశ్మీర్ లోని బిజ్ బెహరా పట్టణ వాసి.
వసీమ్ రజా గత రెండేళ్లుగా డ్రీమ్ 11 యాప్ లో అనేక క్రీడాంశాల్లో బెట్టింగ్ లతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇన్నాళ్లకు అతడిని అదృష్ట దేవత కరుణించింది. అతడు ఎంపిక చేసిన ఫాంటసీ క్రికెట్ జట్టు డ్రీమ్ 11 యాప్ లో ప్రథమస్థానంలో ఉండడంతో జాక్ పాట్ తగిలింది.
వసీమ్ నిద్రపోతుండగా, ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి 'నువ్వు ఎంపిక చేసిన జట్టు డ్రీమ్ 11 యాప్ లో ప్రథమస్థానంలో ఉంది' అని చెప్పాడు. దాంతో, వసీమ్ డ్రీమ్ 11 యాప్ చూడగా, రూ.2 కోట్ల జాక్ పాట్ గెలుచుకున్నట్టు అందులో మెసేజ్ ఉంది. కాగా, జీవితంలో అంతమొత్తం ఎరుగని ఆ పేద కుటుంబానికి చెందిన యువకుడు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఆ డబ్బుతో తన తల్లికి చికిత్స చేయిస్తానని, ఆమె గత పదిహేనేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోందని వెల్లడించాడు. అసలిదంతా ఓ కలలా అనిపిస్తోందని పేర్కొన్నాడు.