GPS: ఏపీ ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రుల కమిటీ సమావేశం
- సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకువచ్చిన ఏపీ సర్కారు
- తమకు జీపీఎస్ వద్దంటున్న ఉద్యోగులు
- ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం
- పాత విధానమే కావాలని పట్టుబట్టిన ఉద్యోగులు
- సీపీఎస్ కంటే జీపీఎస్ మంచిదన్న సజ్జల
జీపీఎస్ పై నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఏపీ ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రుల కమిటీ నిర్వహించిన సమావేశం ముగిసింది. పాత పెన్షన్ విధానం (సీపీఎస్) సాధ్యం కాదని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తేల్చి చెప్పింది. జీపీఎస్ పైనే చర్చిద్దామని కమిటీ స్పష్టం చేసింది. పాత పెన్షన్ విధానంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడింది. జీపీఎస్ విధానం అమలుకు ఉద్యోగ సంఘాలు సహకరించాలని, దీనిపై ఉద్యోగులకు నచ్చచెప్పాలని సూచించింది. అయితే ఉద్యోగులు మాత్రం పాత పెన్షన్ విధానంపైనే చర్చించాలని డిమాండ్ చేశారు.
దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, జీపీఎస్ లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉద్యోగులకు మేలు చేసేందుకు జీపీఎస్ తీసుకువచ్చామని తెలిపారు. సీపీఎస్ కంటే జీపీఎస్ మెరుగైనదని అన్నారు. పాత విధానంతో ఆర్థికంగా ఎంతో భారం పడుతుందని సజ్జల వెల్లడించారు. ఐదేళ్ల కోసం కాదు... భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాం అని స్పష్టం చేశారు. సీపీఎస్ లో పింఛనుకు భరోసా ఉండదని, జీపీఎస్ లో 33 శాతం గ్యారంటీతో ప్రతిపాదన చేశామని తెలిపారు.