Rahul Gandhi: బ్రిటన్ వివాదాస్పద ఎంపీతో రాహుల్ గాంధీ ఫొటో... విమర్శనాస్త్రాలు సంధించిన బీజేపీ
- బ్రిటన్ లో పర్యటించిన రాహుల్ గాంధీ
- కేంబ్రిడ్జి వర్సిటీలో సదస్సులో పాల్గొన్న వైనం
- ఈ సందర్భంగా జెరెమీ కోర్బిన్ తో ఫొటో
- కోర్బిన్ భారత్ వ్యతిరేకి అని వెల్లడించిన బీజేపీ
- రాహుల్ ఎప్పుడూ దేశ విరోధులతోనే కలుస్తుంటారని విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ఇంగ్లండ్ లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బ్రిటన్ వివాదాస్పద ఎంపీ జెరెమీ కోర్బిన్ తో ఫొటో దిగారు. ఈ ఫొటోలో టెలికాం సాంకేతిక రంగ నిపుణుడు శ్యామ్ పిట్రోడా కూడా ఉన్నారు. ఈ ఫొటోను కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగం సోషల్ మీడియాలో పంచుకుంది.
అయితే, జెరెమీ కోర్బిన్ తో రాహుల్ ఫొటో దిగడం పట్ల బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించింది. కశ్మీర్ అంశంలో భారత్ పై విషం కక్కే బ్రిటన్ ఎంపీతో రాహుల్ ఫొటో దిగడం ఏంటని కాషాయ దళం ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రిటన్ ఎంపీ జెరెమీ కోర్బిన్ కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ గొంతుకను వినిపించే వ్యక్తి అని బీజేపీ వెల్లడించింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందించారు.
"పాక్ అనుకూల కోర్బిన్ తో ఫొటో కానివ్వండి, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లోకి చైనా సొమ్ము స్వీకరించడం తాలూకు ఒప్పందం కానివ్వండి, లేక డోక్లామ్ వద్ద చైనీయులతో భేటీ కానివ్వండి... రాహుల్ ఎప్పుడూ దేశ వ్యతిరేకులతోనే చేయి కలుపుతుంటారు" అని షెహజాద్ పూనావాలా విమర్శించారు. "మోదీపై కోపం ఉంటే దేశం ఏంచేసింది? దేశం పట్ల విరోధం ఎందుకు?" అని రాహుల్ ను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చైనాతో ఒప్పందంపై సంతకాలు చేస్తున్న ఫొటోను కూడా షెహజాద్ పూనావాలా పంచుకున్నారు. అంతేకాదు, బ్రిటన్ ఎంపీ జెరెమీ కోర్బిన్ గతంలో భారత్ పై విషం కక్కిన ట్వీట్ ను కూడా పోస్టు చేశారు. కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ కోర్బిన్ నాడు పేర్కొన్నారు.