Chandrababu: కోనసీమలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని ఖండిస్తున్నా: చంద్రబాబు
- కోనసీమలో తీవ్ర అల్లర్లు
- అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యే నివాసాలకు నిప్పు
- కోనసీమ జిల్లాకు పేరు మార్పు వద్దంటూ ఆందోళనలు
- అల్లర్ల వెనుక టీడీపీ ఉందన్న హోంమంత్రి
- నిరాధార ఆరోపణలు చేయడం తగదన్న చంద్రబాబు
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులు ఇవాళ అమలాపురంలో తీవ్ర విధ్వంసానికి పాల్పడ్డారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబుల ఇళ్లకు నిప్పటించారు. అయితే ఈ అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయని ఏపీ హోంమంత్రి తానేటి వనిత తీవ్ర ఆరోపణలు చేశారు.
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. కోనసీమలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. సున్నితమైన అంశంలో హోంమంత్రి నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఘర్షణలు దురదృష్టకరమని అన్నారు.
ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు.