Konaseema District: ఈ తరహా శక్తుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రభుత్వానికి తెలుసు: సజ్జల
- కొన్ని శక్తులు నిరసనకారుల్ని రెచ్చగొట్టాయన్న సజ్జల
- ఫలితంగానే అమలాపురంలో విధ్వంసం అంటూ వ్యాఖ్యలు
- సంయమనంతోనే ఈ కుట్రను అదుపులోకి తెచ్చామన్న సజ్జల
కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మంగళవారం అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో... ఆ రాత్రికే అమలాపురం చేరుకున్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి... ఆందోళనకారుల దాడుల్లో ధ్వంసమైన మంత్రి పినిపే విశ్వరూప్ నివాసాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడే మీడియాతో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లర్లను సృష్టించిన శక్తులను ఎలా హ్యాండిల్ చేయాలో తమ ప్రభుత్వానికి తెలుసు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
కొన్ని శక్తులు నిరసనకారుల్ని రెచ్చగొట్టి అమలాపురంలో విధ్వంసం సృష్టించాయని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్లాన్ ప్రకారమే అమలాపురంలో విధ్వంసం సృష్టించారన్న ఆయన.. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని వర్గాలు కోరాయని తెలిపారు. ప్రధాన పార్టీలన్నీ మద్దతు పలికాయని, జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారని తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టాలని విపక్షాలు కుట్ర పన్నాయని, కొన్ని శక్తులు నిరసనకారులను రెచ్చగొట్టాయని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంయమనం పాటించడంతోనే ఈ కుట్రను అదుపులోకి తెచ్చామని ఆయన తెలిపారు.